Friday 11 September 2015

తిరుమలేశుని వైభవం

తిరుమల శ్రీ వెంకటేశ్వర వైభవం

తిరుమలలో శ్రీ వారికి జరిగే నిత్య సేవలు పలురకాలు. ఆ విశేషాలు వర్ణింపశక్యం కానివి. తూర్పు తెల్లవారక ముందే స్వామి వారికి ఈ నిత్య సేవలు ఆరంభమవుతాయి.

సుప్రభాత సేవ

శ్రీవారికి చేసే మొట్టమొదటి సేవ, ప్రతిదినం తెల్లవారు జామున 3 గంటల సమయంలో మొదలవుతుంది. అర్చకుల రాకను తెలియబర్చటానికి పెద్ద పలక గంటను మోగిస్తారు. మహాద్వారం తెరుచుకుంటుంది. సన్నిధి గొల్ల ముందు నడుస్తుండగా మిగతావారు వెనుక నడుస్తారు. తాళం చెవులను క్షేత్రపాలక శిలకు తాకించి అయన అనుమతి తీసుకుని, ఆనందనిలయ విమానం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అర్చకులు "కౌసల్యా సుప్రజా రామా" అంటు ప్రారంభించి, తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి, శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనం పఠిస్తారు. తాళ్ళపాక అన్నమయ్య వంశానికి చెందిన ఒకరు తుంబూరా మీటుతూ శ్రీ స్వామివారిని మేల్కొలుపుతారు. తర్వాత దీపోద్దీపనం, గర్భాలయ సంమార్జనం చేసి స్వామివారిముందు తెరను వేస్తారు. నివేదన, తాంబూలం సమర్పిస్తారు. నవనీతి హారతి, తీర్థం, శఠారి ఇస్తారు. స్స్వామివారి దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు. ఈ సుప్రభాత గీతాన్ని "ప్రతివాది భయంకర అన్నన్" అనే భక్తుడు క్రీ. శ. 1430 నుంచి శ్రీవారి ఆలయంలో పాడటం ప్రారంభించి వుంటారని భావిస్తారు.

అర్చన

ప్రతీరోజూ ఉదయం 4 గంటలకు జరిగే ఆరాధన, జియ్యంగారు యమునత్తురైకి వచ్చి అక్కడి పుష్పమాలలు, వెదురుగంపను తలపై పెట్టుకుని బయలదేరుతారు. వీటిని శుద్ధిచేసి, జేగంటను మ్రోగిస్తూ ఆరాధన ప్రారంభిస్తారు. స్వామివారికి ఆకాశగంగ నుంచి తెచ్చిన తీర్థం అర్ఘ్యపాద్యాదులు, ఉదయం, సాయంత్రం పూజకి, బ్రహ్మారాధనకు ఉపయోగిస్తారు. అర్చన సమయంలో మంత్తాశనం, స్నానాశనం, పుష్పాన్యాసం, అలంకారాసనం నిర్వహించి, స్వామికి పురుషసూక్తం చదువుతూ అభిషేకిస్తారు. జియ్యంగార్లు నిరాట్టం చదువుతారు. అభిషేక సమయంలో విగ్రహానికి పలుచని గుడ్డ కట్టి నూనె రాసి, చింతపండు నీటిని కలిపి ఆ జిడ్డును తోలిగిస్తారు. ఆవుపాలు, గంధం, పసుపునీటితో అభిషేకించి, శుద్దోదక స్నానం చేయించి, చివరగా గంగోదక స్నానం చేయించి, మరలా శుద్దోదక స్నానం చేయిస్తారు. తరువాత పుస్పాంజలి సమర్పించి, మూలవిగ్రహానికి, భోగ శ్రీనివసమూర్తి విగ్రహనికి స్వర్ణ సూత్రాన్ని కలుపుతారు. మూల విగ్రహానికి పుష్పన్యాసం జరుపుతారు. గర్భగృహం వద్దనున్న మెట్టును కడిగి అర్చన చేస్తారు. అలంకారాసనంలో స్వామివారికి ఆసనం, వస్త్రం, భూషణం, ఉత్తరీయం సమర్పిస్తారు. కర్పూరంతో నుదుటిమీద ఊర్ధ్వపూండ్ర చిహ్నాన్ని దిద్ది యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నాన పీఠంలో పెట్టి, వీటితో పాటు గర్భగుడిలో ఉన్న విగ్రహాలకు అభషేకం చేస్తారు. అభిశేకించిన నీటిని ఒక పాత్రలోకి సేకరిస్తారు. జియ్యంగారు, భక్తులు తిరుప్పళ్లి ఎళుచ్చి అరవై పాశురాలను గానం చేస్తుంటారు.

తోమాల సేవ

తమిళంలో 'తోదుత్తమాబై' అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. ఆ పదమే కాలక్రమేణా "తోమాల"గా మార్పు చెంది, తోమాలసేవ అయి ఉంటుందని భావిస్తారు. తోమాలసేవనే "భగవతీ ఆరాధన" అని అంటారు. ప్రాతఃకాలంలో స్వామివారి ఆరధనలో భాగంగా మూల విగ్రహంపై ఉండే బంగారు కవచానికి, భోగ శ్రీనివాసుకి అభిషేకం జరుగుతుంది. తరువాత స్వామివారిని అనేక రకాల పూలమాలలతో అలంకరిస్తారు. తెల్లవారుజామున సుమారు 3.45నుండి 4.30 వరకు జరుగుతుంది.

అష్టదళ పద్మారాధన

శ్రీ స్వామివారికి అష్టదళ పద్మారాధన 108 సువర్ణ పుష్పాలతో జరుగుతుంది. వీటిని గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అను భక్తుడు సమర్పించాడు.

సహస్రనామార్చన

ఈ అర్చన తెల్లవారుజాము 4.45 నుండి 5.30 వరకు జరుగుతుంది. అర్చకుడు శ్రీవారి పాదాల చెంత కూర్చుని సంకల్పం చెప్పుకుని జేగంట వాయిస్తూ పువ్వులు, తులసిపత్రాలు తీసుకుని "ఓం వేంకటేశ్వరాయ నమః" అని అంటూ స్వామివారి వేయి పేర్లను స్తుతిస్తూ చేసే సేవ ఇది. తర్వాత శ్రీవారి పాదాలు వద్ద ఉన్న పువ్వులు, తులసి పత్రాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో మిరాశీదారు లక్ష్మీ సహస్రనామాలను పఠిశ్తారు. చివర్లో నక్షత్ర హారతి, కర్పూర హారతి జరుగుతాయి. (ఆర్జితసేవ)

గురువారంనాడు జరిగే సేవలు -- ఉదయం సేవ

ప్రతఃకాలారాధన తర్వాత తలుపులు మూసి, స్వామివారి ఆబరణాలన్నీ తీసివేస్తారు. నుదుటన గల పచ్చ కర్పూరపు నామాన్ని తగ్గిస్తారు. దీనివలన స్వామివారి నేత్ర సౌందర్యం భక్తులు కనులారా గాంచవచ్చు. తరువాత స్వామివారికి 24 మూరల పట్టంచు ధోవతిని, 12 మూరల ఉత్తరీయాన్ని కడతారు. శ్రీవారికి సువర్ణపాదాలు, సువర్ణహస్తాలు, శంఖచక్రాలు, కర్ణాభరణాలు, సువర్ణ సాలగ్రామ హారాలు సమర్పించి, తలుపు తీస్తారు. దీనినే "సడలింపు" లేదా "సళ్ళింపు" అంటారు.

మధ్యాహ్న సేవ

మధ్యాహ్నం అస్థాన మండపంలో తిరుప్పావడ జరుగుతుంది. శ్రీవారి ముందు తెరవేసి సుమారు 450 కిలోల అన్నప్రసాదం (పులిహోర) పెట్టి, దానిమీద శ్రీవారి ద్రుష్టి ప్రసరించేలాగా పెడతారు

No comments:

Post a Comment