Friday 11 September 2015

మట్టి వినాయకుడు పూజించడం వెనుక రహస్యం


ఓం గం గణపతయే నమః

వినాయకచవితికి మట్టి ప్రతిమలనే పూజించడం వెనుక సామాజిక, శాస్త్రీయ కారణం కూడా ఉంది. వినాయక చవితి వర్షఋతువు చివరలో వస్తుంది. వర్షాలు సమృద్దిగా కురిసే కాలం ఇది. మన పూర్వీకులకు ఎంతో మేధా శక్తి ఉంది. ఈ ప్రపంచంలో తొలిసారిగా వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టి ఆ నీటిని భవిష్యత్తు అవసరాలకు వాడాలనే ఆలోచన వాళ్ళకే కలిగింది. అది ఆదిపూజ్యుడైన గణనాధుడి ఆరాధనతో ముడిపెట్టారు.

ఎండాకాలంలో చెరువుల్లో నీరు తగ్గుతుంది. వర్షాకాలం రాకముందే ఆ చెరువుల్లో ఉన్న బురుదను బయటకు తీయాలి. అలా చేయడం వల్ల వాననీటిని అధికంగా నిలువ చేసుకునే సామర్ధ్యం చెరువుకు ఉంటుంది. వర్షాకాలంలో వర్షాలు కురుసి చెరువు నిండుతుంది. నిండిన చెరువులో మట్టిని వేయడం వలన అది బురుదగా మారి, చెరువు అడుగు భాగానికి చేరి నీరుని ఇంకకుండా అడ్డుపడుతుంది. ఏ బంకమట్టినైతే వర్షాలు మొదలవకముందు పూడిక తీస్తారో, ఆ బంకమట్టితోనే వరసిద్ధి వినాయకుడి ప్రతిమను చేసి పూజించి, ఆఖరున ఆ మట్టి విగ్రహాన్ని అదే చెరువులో నిమజ్జనం చెస్తారు. మట్టి విగ్రహం తయారు చేయడం కోసం పూడిక తీయడం, నిమజ్జనంతో తిరిగి చెరువులో మట్టిని వేయడం జరిగిపోతుంది. ఇది మట్టి ‪#‎గణపతి‬ ప్రతిమనే పూజించడం వెనుక ఉన్న సామాజిక కారణం.

ఒక ప్రక్క ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని, మరొకప్రక్క నీటిని ఒడిసిపడుతూ వాననీటిరక్షణ ప్రచారాన్ని, చెరువులను కాపాడుతూ చెరువుల రక్షణను, పర్యావరణ పరిరక్షణను, అందరు కలిసి ఆ మట్టిని తీయడం,దాన్ని అందరు కలిసి చెరువులో ఒకే రోజున కలపడం ద్వారా ప్రజల మధ్య ఐక్యతను,బంధాన్ని పెంపొందిస్తూ, అందరికి సామాజిక బాధ్యతను అలవాటు చేసింది మన హిందూ సమాజం, వైదిక సంస్కృతి. ఇది మన పురాతనమైన సనాతన సంస్కృతి.

కానీ ఈ రోజున జరుగుతున్నది ఇందుకు పూర్తి విరుద్ధం. మనం సంప్రదాయాన్ని, సంస్కృతిని మర్చిపోయాం. ఆధునికపోకడలతో మట్టి విగ్రహాలకు బదులు ప్రకృతికి హాని తలపెట్టే ప్లాస్టర్-ఆఫ్-పారిస్ విగ్రహాలను పూజించి, చెరువుల్లో నిమజ్జనం చేసి, చెరువులను, భూగర్భ జలాలను పాడు చేస్తున్నాం. చెరువులు, నదులు, సముద్రాల్లో ఉందే జీవరాశుల మరణానికి కారణమై పాపాన్ని మూటగట్టుకుంటున్నాం. నిమజ్జనం చేసిన విగ్రహం నీటిలో కరగీ కరగక, దుర్గంధమైన నీటిలో గణపతిని కలిపి పరమాత్మను అవమానిస్తున్నాం. చెరువుల నిండా బురద నిండి, అది తీసేవాడు లేక ఇబ్బందిపడుతుంటే, పండుగ పేరుతో రసాయనాలతో చెరువులను మరింతగా పూడుస్తూ, జలవనరులను నాశనం చేసుకుంటున్నాం.

సంప్రదాయబద్దంగా పర్యావరణహితమైన వినాయక చవితినే జరుపుకుందాం. పర్యావరణాన్ని కాపడుకుందాం. మట్టి ప్రతిమలను మాత్రమే పూజిద్దాం. సంప్రదాయాన్ని రక్షించుకుందాం.

ఓం గం గణపతయే నమః

No comments:

Post a Comment